December 22, 2024

నేనూ మాట్లాడాలని నిర్ణయించా..

Article 19(1) (a) of the Constitution of India states that all citizens shall have the right to freedom of speech and expression.

భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికీ మాట్లాడే స్వాతంత్ర్యము ఉన్నది. కానీ మనము చాలా విషయాలలో మాట్లాడాలనుకున్నప్పటికీ…. పరిస్థితుల ప్రభావంతోనో లేక ఆయా కారణాలనుబట్టియో మాట్లాడకుండా మన అభిప్రాయాలను చెప్పకుండానే ఉండిపోతాం. నేనూ అదే విధంగా ఉండి పోయాను.

కానీ… నా లోపల ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల విశ్లేషణలు, మదిని తొలుస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని విషయాలు తప్పు అనిపిస్తున్నాయి, కొన్ని కొన్ని విషయాలు ఒప్పనిపిస్తున్నాయి. అయినా వాటిని వెల్లడించే సాహసం చేయలేదు.

చివరకు ఏదైనా వీడియో చూసినా లేక ఏదైనా వార్త చదివినా దానిపై నా అభిప్రాయాన్ని చెప్పలేను కనుక నేను అనుకునే అభిప్రాయాన్ని ఎవరైనా వ్యక్తం చేశారా అని కామెంట్లను చదవడం మొదలుపెట్టాను. అంతిమంగా అర్థమైందేమిటంటే నా ఆలోచనలకు అనుగుణమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వారున్నప్పటికీ వారి అభిప్రాయాలు చేరాల్సిన వ్యక్తులకు లేదా వ్యవస్థలకు చేరడం లేదు.

కాబట్టి నేను అభిప్రాయం అనే ఈ వేదికను రూపొందించి తద్వారా నా అభిప్రాయాన్నీ…. వీలైతే ఇతరులకు వారి అభిప్రాయాలనూ పంచుకునే అవకాశాన్ని అందించాలని అనుకున్నాను. నేటి రోజున అభిప్రాయం అనే ఈ వేదిక ఏ ఒక్కరికి తెలియనప్పటికీ… ఏదో ఒకరోజున వ్యక్తులు లేదా వ్యవస్థలు వారి పనులను గూర్చి లేదా నిర్ణయాలను గూర్చి నిష్పాక్షికమైన అభిప్రాయం కొరకు ఈ వేదికను సందర్శిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

వ్యక్తులను, వ్యవస్థలను విమర్శించాలని కాదు కానీ.. నా అభిప్రాయాలను కూడా తెలియపరచాలనేదే నా కోరిక. ఒకవేళ అది విమర్శ అయిననూ… సద్విమర్శ ఎల్లప్పుడు మేలునే చేస్తుంది కనుక నేను నా అభిప్రాయాలను ఈ అభిప్రాయం వేదిక ద్వారా తెలియపరచడానికి నిశ్చయించుకున్నాను.

దేశంలో ప్రజాస్వామ్యానికి ఇది కూడా ఆజ్యం పోస్తోందని ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *